Monday 21 December 2009

తియ్యని కల

నిన్న రాత్రి సెకండ్ షో చూసి నిద్రపోయాను.
తెల తెల వారుతుండగా కమ్మటి కల, నీ గురించే.
ఎంతగా పులకించి పోయానో తెలుసా.
................................................................................................................................
ఊరి పిల్ల కాలువలో, పాంటు పట్టి కొంచెం పైకి మడిచి
గల గలా నవ్వుతూ, నీళ్ళకు వచ్చిన ఆడపిల్లల్లా బిరా బిరా నడుస్తూ సాగే ఆ పిల్ల కాలువలో,
పాదాల వరకే వుంచి అలా మన పెద్దబావి పక్కన వున్న 3 ఎకరాల వరిపైరుని చూస్తుంటే
ఎంత పరవశం చెండుతానో , ఈ చిట్టి పాపాయిని చూసినా అంతే సంతోషం కలుగుతుంది.




అమాయకంగా నవ్వే, నీ లేత మోము గుర్తొస్తే చాలు,
మావిడి చెట్టు పొలం మధ్యలో అమ్మ ఎంతో ఇష్టపడి నాటిన,
బొండు మల్లె చెట్టుకు పూసిన మూడే మూడు తెల్లని మల్లె పూలు గుర్తొస్తాయి.

ఓ ఫ్రెండ్ చెప్పినట్లు, అందంగా వుండటం వేరు. జీవత్వం వుండటం వేరు.
నిన్ను చూస్తూనే నాకా విషయం బోధ పడింది.
తెల్లగా నవ్వే చిట్టి గడ్డి చేమంతి పువ్వులా అమాయకంగా,
పున్నమి రేయి గోదారిలో పారే జీవధారలా స్వచ్చంగా,
ఎండా కాలంలో మంచం ఆరు బయట వేసుక్కూర్చుంటే తగిలే పిల్ల గాలి స్పర్స లా,
అదే సాయత్రం అమ్మడానికి వచ్చే మొగ్గ మల్లెపూల బండి చుట్టూ చేరే అందమైన ఆడపిల్లల్లా
ఎప్పుడూ విరగ నవ్వే నిన్ను చూస్తూ ఓ జీవిత కాలం గడిపెయొచ్చు.

...........................................................................................................................
ఎంత తియ్యటి కల.
పొద్దున్నే నిద్ర లేచి చూసానా,
లేత మావి చిగురుపై రాత్రి కురిసిన వెండి మంచు బిందువు,
పొద్దున్నే వచ్చిన నారింజ పండు సూర్య కిరణాలకి కరిగి నెమ్మదిగా నుదట జారింది.
ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను, ఎంత తియ్యటి స్పర్స. మొదట నువ్వే నుడుటున ముద్దిచ్చావనుకున్నాను.
ఆ ఊహే ఆపాదమస్తకం పులకిన్తకు గురిచేసింది.

ఈ రోజు భలే మంచి రోజు.

No comments:

Post a Comment